Friday, September 20, 2024
HomeUncategorizedఅయోధ్యలో ఎటు చూసిన జైరామ్‌ నినాదాలే

అయోధ్యలో ఎటు చూసిన జైరామ్‌ నినాదాలే

Date:

అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకోవడానికి రామ మందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది. విశేషంగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.. రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. హారతి, నివేదన సమయాన్ని తగ్గించారు. యావత్‌ భారతదేశంతో పాటు విదేశాల నుంచి రామ్‌లల్లా దర్శనానికి భక్తులు బారులు తీరి బాల రాముడిని దర్శనం చేసుకున్నారు. మంగళ, శృంగార హారతి సందర్భంగా డ్రైఫ్రూట్స్‌, రాబ్డీని నివేదించారు. అనంతరం ఉదయం 6.30 గంటల దర్శనాలు ప్రారంభం కాగా.. జైరామ్‌ నినాదాలతో ఆలయం మార్మోగింది.

మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు రాజ్‌భోగ్‌, హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్లీ ఆరుగంటల వరకు దర్శనాలు కొనసాగాయి. సూర్యాస్తమయం తర్వాత మరోసారి సాయంత్రం హారతి సమయంలో నైవేద్యాన్ని సమర్పించారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు దర్శనాలను నిలిపివేశారు. హారతి, నైవేద్యం నివేదన అనంతరం బాల రాముడి పవళింపు సేవ నిర్వహించారు. ప్రస్తుతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా భవ్య మందిరంలోనూ భక్తులకు ఏలకులు మాత్రమే ప్రసాదంగా అందజేస్తున్నారు.