Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయం10 నిమిషాల వీడియో కాల్‌లో 400మంది తొలగింపు

10 నిమిషాల వీడియో కాల్‌లో 400మంది తొలగింపు

Date:

ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు, ఇతరత్రా కారణాలతో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా సంస్థలు ఉద్యోగాల కోతలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ బెల్‌ లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో 400లకు పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్‌ గ్రూప్‌ మీటింగ్‌లో బెల్‌ మేనేజర్‌ ఈ లేఆఫ్‌ నోటీసును చదివి వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగుల తొలగింపులపై కంపెనీ సీఈవో మిర్కో బిబిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కోసం సంస్థాగత మార్పులు చేయనున్నామని, అందుకు కోతలు తప్పేలా లేవని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దాదాపు 4,800 మందిని తొలగించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 9శాతానికి సమానం.

తాజా లేఆఫ్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘సిగ్గుచేటు’ చర్య అని కెనడాకు చెందిన ఉద్యోగుల సంఘం ‘యూనిఫోర్‌’ దుయ్యబట్టింది. నిమిషాల వ్యవధిలో తొలగింపులపై ప్రకటన చేశారని, కనీసం ఉద్యోగులు ప్రశ్నలు అడిగేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించింది. ఓవైపు, వాటాదారులకు డివిడెండ్‌ పేఅవుట్‌ను పెంచుకుంటూ సామాన్య ఉద్యోగులను తొలగించడాన్ని తప్పుబట్టింది.

డెల్‌లోనూ కోతలు..

అటు ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ కూడా ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది. ఖర్చు తగ్గింపులో భాగంగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలికారన్న దాన్ని మాత్రం వెల్లడించలేదు. గతేడాది ఈ సంస్థ ఏకంగా 6,650 మందికి లేఆఫ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి డెల్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,20,000కు పడిపోయింది. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ పర్సనల్‌ కంప్యూటర్లకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో నష్టాలను చవిచూస్తోంది. గత నెల ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం 11శాతం తగ్గింది. ఈ క్రమంలోనే తాజా తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిబంధనపై ఇటీవల డెల్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పింది.