రోజువారి ఖర్చుల కోసం తండ్రి తగినంత డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఒక 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 21న పట్టి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు 50 ఏళ్ల వ్యాపారవేత్త మహ్మద్ నయీమ్‌పై కాల్పులు జరిపి చంపారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు, హంతకులైన పీయూష్ పాల్, శుభమ్ సోనీ, ప్రియాంషులను అరెస్ట్ చేశారు.
ముగ్గురు నిందితులను ప్రశ్నించిన పోలీసులు వారు చెప్పింది విని షాకయ్యారు. మహ్మద్ నయీమ్‌ను హత్య చేసేందుకు ఆయన 16 ఏళ్ల కుమారుడు ఆ షూటర్లను నియమించుకున్నట్లు తెలుసుకున్నారు. తండ్రిని చంపితే ఆరు లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్న ఆ యువకుడు వారికి రూ.1.5 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. కోరికలు తీర్చుకునేందుకు తరచుగా షాపులో డబ్బులు లేదా ఇంట్లోని నగలను దొంగిలించేవాడని చెప్పారు. గతంలో కూడా తండ్రిని చంపేందుకు ప్లాన్ వేసిన అతడు విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. నిందితుడైన మైనర్ బాలుడ్ని బాలల కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.