Wednesday, September 25, 2024
HomeUncategorizedకాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం

కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం

Date:

దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని అన్ని గ్రామాల్లో, నగరాల్లో ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ”దేశం మార్పును కోరుకుంటోంది. భారత్‌ వెలిగిపోతోందంటూ 2004లో బిజెపి ప్రచారం చేసింది. అప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు అవే ఫలితాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటి గతే పడుతుంది. పార్టీ మేనిఫెస్టోకు విస్తృత ప్రచారం కల్పించడం మన బాధ్యత. దేశంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్‌ మేనిఫెస్టో చేరువకావాలి. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ అమలు చేస్తుంది” అని ఖర్గే తెలిపారు.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ”రాహుల్‌ చేసింది కేవలం రాజకీయ యాత్ర కాదు. ఇలాంటిది ఇంతకముందు ఏ నాయకుడు చేయలేదు. రెండు యాత్రలతో దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి” అని సీడబ్ల్యూసీ భేటీలో అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌తోపాటు ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. మహిళల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ‘నారీ న్యాయ్‌’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది. మరోవైపు అధికారంలోకి రాగానే పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చింది. ఇదే కాకుండా ‘కిసాన్‌ న్యాయ్‌’ పేరిట ఐదు హామీలు ప్రకటించింది.