లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళ ప్రయాణికులను కిందకు దించేసిన ఘటన ‘ఎయిర్ న్యూజిలాండ్’లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ వ్యవహారంపై స్పందించిన సదరు విమానయాన సంస్థ.. ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది. ఏంజెల్ హార్డింగ్ అనే మహిళ స్నేహితురాలితో కలిసి నేపియర్ నుంచి ఆక్లాండ్‌కు బయలుదేరారు. విమానం రన్‌వేపైకి చేరుకున్న సమయంలో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. ఎందుకని వారు ప్రశ్నించగా.. సరైన స్థితిలో కూర్చునేంత వరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అటెండెంట్ అమర్యాదకరంగా, దురుసుగా వ్యవహరించిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. విమానం కదులుతున్నందున కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని వారిని కోరడంతో.. సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఈ పరిణామంతో షాక్‌కు గురయ్యామని బాధిత మహిళ వాపోయారు.
ఈ వివాదంతో విమానం తిరిగి బోర్డింగ్ ప్రదేశానికి వచ్చింది. ‘అసౌకర్యం’ కారణంగా ప్రయాణికులంతా కిందకు దిగిపోవాలని సిబ్బంది కోరారు. తిరిగి వారిని ఎక్కించుకొనే వేళ బాధిత మహిళలను మాత్రం విమానంలోనికి అనుమతించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. కారణం స్పష్టంగా చెప్పనప్పటికీ.. తమ శరీర ఆకృతి, అధిక బరువు కారణంగానే తమను దించేశారని అర్థమైనట్లు సదరు మహిళ వాపోయారు. ఇలాంటి అవమానకర పరిస్థితి మరెవ్వరికీ ఎదురుకాకూడదన్నారు. ఈ విషయంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో సదరు విమానయాన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వారి టికెట్ డబ్బులు వాపస్ చేయడంతోపాటు ఆరోజు స్థానికంగా బస కల్పించినట్లు వెల్లడించింది. వారిద్దరికీ ఎదురైన చేదుఘటనకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులతో హుందాగా నడుచుకునేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది.