Monday, December 23, 2024
Homeక్రైంనకిలీ ఆర్పీఎఫ్‌ ఎస్ఐ మాళవిక అరెస్ట్

నకిలీ ఆర్పీఎఫ్‌ ఎస్ఐ మాళవిక అరెస్ట్

Date:

ఒక యువతికి కంటిచూపు సరిగ్గా లేకపోవడంతో రైల్వే పోలీసు కావాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరలేదు.. ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థులను సంతృప్తి పరచడానికి పోలీసు అధికారిగా ప్రజల్లో చలామణి కావాలని నిర్ణయించుకుని ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ అవతారమెత్తింది. విధులకు వెళ్తున్నట్టు దాదాపు ఏడాది పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించింది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లి కటకటాల పాలైంది.

కేసు వివరాలను మంగళవారం రైల్వే ఎస్పీ సలీమా మీడియాకు వెల్లడించారు. నార్కట్‌పల్లికి చెందిన మాళవిక హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆర్పీఎఫ్‌ ఎస్ఐ పరీక్షకు హాజరైంది. కంటి చూపు సరిగాలేక అర్హత సాధించలేకపోయింది. ఎలాగైనా తన తల్లితండ్రులు, గ్రామస్థుల ముందు పోలీస్‌గా చలామణి అవ్వాలని నిర్ణయించుకుంది. ఎల్బీ నగర్‌ ప్రాంతంలో ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫాం కొనుగోలు చేసింది. రైల్వే ఎస్ఐ నల్గొండలో విధులు నిర్వహిస్తున్నట్లు దాదాపు ఏడాది పాటు ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేది. చివరికి పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లింది. అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్‌లో పై అధికారులను ఆరా తీయగా ఆమె అసలు గుట్టు బయట పడింది. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్‌ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె మోసాల చిట్టా బయటపడింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఎస్పీ తెలిపారు.