Wednesday, September 25, 2024
HomeUncategorizedసేలం సభలో భావోద్వేగానికి గురైన మోడీ

సేలం సభలో భావోద్వేగానికి గురైన మోడీ

Date:

దేశంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం తమిళనాడులోని సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బిజెపి నాయకుడు వి.రమేశ్‌ను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి తిరిగి ప్రారంభించారు. ”ఆడిటర్‌ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన మనతో లేరు. ఆయనో గొప్ప వక్త. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ, ఆయన హత్యకు గురయ్యారు. సభాముఖంగా నేను ఆయనకు నివాళి అర్పిస్తున్నా” అని ప్రధాని మోడీ అన్నారు.

వృత్తిరీత్యా ఆడిటర్‌ అయిన రమేశ్‌ గతంలో తమిళనాడు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2013 జులైలో ఆయనను నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇదే సభలో మరో బిజెపి నాయకుడు కేఎన్‌ లక్ష్మణన్‌ సేవలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. అంతకుముందు డీఎంకే, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు మహిళలు, హిందుత్వాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆ కూటమిని ప్రజలు ఓడిస్తారని ప్రధాని అన్నారు.