Wednesday, September 25, 2024
HomeUncategorizedఅన్నాడీఎంకే పార్టీకి రూ.6.05కోట్ల విరాళాలు

అన్నాడీఎంకే పార్టీకి రూ.6.05కోట్ల విరాళాలు

Date:

దేశంలో ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వీటితో ఏ పార్టీకి ఎంత మొత్తం దక్కిందనే సమాచారం బయటికొచ్చింది. కొన్ని పార్టీలు ఈ బాండ్లతో తమకు ఎవరు విరాళం ఇచ్చారనే విషయాన్ని కూడా ఈసీతో పంచుకున్నాయి. అలా తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష అన్నాడీఎంకే చెప్పిన దాతల పేర్లలో ఒకటి అందరిని ఆకర్షించింది. అదే చెన్నై సూపర్ కింగ్స్‌. ఆ పార్టీకి దక్కిన ఎన్నికల బాండ్లలో ఈ ఫ్రాంచైజీ యాజమాన్యానిదే మెజార్టీ వాటా అని తెలుస్తుంది.

ఈసీ గణాంకాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల ద్వారా అన్నాడీఎంకే పార్టీకి రూ.6.05కోట్ల విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.5కోట్లు సీఎస్‌కే యాజమాని చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్‌ లిమిటెడ్‌ ఇచ్చినవే. 2019 ఏప్రిల్‌ 2 నుంచి 4 తేదీల్లో ఈ మొత్తాన్ని పార్టీ అందుకుంది. దీంతోపాటు కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ రూ.కోటి, గోపాల్‌ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి రూ.5 లక్షలు అన్నాడీఎంకేకు బాండ్ల రూపంలో విరాళమిచ్చినట్లు డేటాలో ఉంది. 2019 తర్వాత ఈ పార్టీకి ఎన్నికల బాండ్ల నుంచి ఎలాంటి నిధులు రాలేదు. కాగా.. సీఎస్‌కే యాజమాన్యం విరాళం విషయాన్ని గతంలో పార్టీ కోఆర్డినేటర్‌ ఒ.పన్నీర్‌ సెల్వం(ఇప్పుడు బహిష్కృత నేత) రెండుసార్లు ఈసీకి వెల్లడించారు. ఆ తర్వాత 2023లో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ కూడా ఇదే సమాచారాన్ని పంచుకున్నారు.