Wednesday, September 25, 2024
HomeUncategorizedనా వ్యాఖ్యలు మోడీ వక్రీకరించారు

నా వ్యాఖ్యలు మోడీ వక్రీకరించారు

Date:

ప్రధాని మోడీ నా వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ చేసిన వ్యాఖ్యలు అవి ఏ మతపరమైనవి కావని.. కేవలం అధర్మం, అవినీతి, అసత్యాల గురించేనని క్లారిటీ ఇచ్చారు. ఈసందర్భంగా ప్రధానిపై విరుచుకుపడిన ఆయన మోడీ వేసుకున్న ‘ముసుగు పవర్‌’ను ఉద్దేశిస్తూ తాను అలా మాట్లాడానన్నారు.

‘నా మాటలు మోదీకి ఇష్టముండదు. వాటిని వక్రీకరిస్తూ ఏదోవిధంగా అర్థాలు మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే నేను మట్లాడేవి గంభీరమైన వాస్తవాలని వారికి తెలుసు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను పేర్కొన్న ‘శక్తి’.. మోదీ వేసుకున్న ముసుగు గురించేనన్నారు. దానిపైనే తాము పోరాడుతున్నామని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఈసీ, మీడియాతోపాటు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసే శక్తి వారికుందన్నారు. కొన్ని వేల రూపాయల రుణాలను చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను ప్రధాని మాఫీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలాఉంటే, ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. జగిత్యాలలో (తెలంగాణ) జరిగిన భాజపా ‘విజయ సంకల్ప సభ’లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల ప్రకటనలను తిప్పికొట్టారు. ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె ఆ శక్తి స్వరూపమేనని.. దానిని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సవాల్‌కు సిద్ధమంటూ మోడీ చెప్పడంపై రాహుల్ ఇలా స్పందించారు.