Wednesday, September 25, 2024
HomeUncategorizedమొత్తం ఉన్నది ఉన్నట్టు బయటపెట్టండి

మొత్తం ఉన్నది ఉన్నట్టు బయటపెట్టండి

Date:

రాజకీయ పార్టీలు విరాళాలకు సంబంధించిన ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ కు ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ రెండుసార్లు గడువు విధించిన సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. అయితే ఈసారి తమ వద్ద ఇంతకు మించీ ఏదీ లేదనేలా ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది.

గత ఐదేళ్లలో రాజకీయ పార్టీలు జారీ చేసిన బాండ్లు, వాటి ద్వారా వ్యక్తులు, సంస్ధల నుంచి స్వీకరించిన విరాళాలకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చినా ఎస్బీఐ మాత్రం అరకొర వివరాలే ఇచ్చింది. ఇందులో ఎన్నికల బాండ్ల వివరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇలాగైతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో మరికొంత డేటాను ఎస్బీఐ బయటపెట్టింది.

అయినా ఇంకా పూర్తి వివరాలు లభించకపోవడంపై సోమవారం మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా మార్చి 21 లోగా అంటే గురువారం లోపు ఎన్నికల బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా తమ దగ్గర ఇంకేమీ వివరాలు లేకుండా పూర్తి డేటా ఇవ్వాలని ఎస్బీఐ ఛైర్మన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎస్బీఐ ఇప్పుడు తమ వద్ద ఉన్న అన్ని వివరాలు ఎన్నికల కమిషన్ కు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.