పాఠశాలలో పరీక్షల విధుల్లో ఉన్న ఒక ప్రభుత్వ టీచర్‌ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్‌ను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారణాసికి చెందిన విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి పోలీస్ భద్రత మధ్య బోర్డ్ హైస్కూల్ పరీక్షల జవాబు పత్రాలను పలు కాలేజీలకు వాహనంలో తరలించారు. ఆదివారం రాత్రి చివరగా ముజాఫర్‌నగర్‌లోని కాలేజీకి వాటిని తీసుకువచ్చారు.
వాహనంలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాష్ మద్యం సేవించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ధర్మేంద్ర కుమార్‌ను పొగాకు అడిగాడు. ఆ టీచర్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో ధర్మేంద్ర కుమార్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఉపాధ్యాయుడు ధర్మేంద్ర కుమార్‌పై కాల్పులు జరిపి హత్య చేసిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందన్న దానిపై ఆ వాహనంలో ఉన్న మిగతా వారిని ప్రశ్నించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.