Sunday, January 12, 2025
Homeక్రైంలిక్కర్ కేసులో కవిత అరెస్ట్

లిక్కర్ కేసులో కవిత అరెస్ట్

Date:

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అరెస్టుపై 14పేజీల మెమో..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు కవితకు ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5.20గంటలకు అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కు కూడా సమాచారం ఇచ్చామని, మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు తరలిస్తుండగా.. కవిత బిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా పోరాడుతామన్నారు. పార్టీ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కక్షసాధింపులను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొంటామన్నారు.

కవిత నివాసం వద్ద ఉద్రిక్తత..

కవిత నివాసం వద్దకు బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బిఆర్ఎస్ లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.