Wednesday, September 25, 2024
HomeUncategorizedరష్యాలో ఎన్నికలు, కేరళలో పోలింగ్

రష్యాలో ఎన్నికలు, కేరళలో పోలింగ్

Date:

రష్యాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. కానీ మన దేశంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. కేరళలో ఆ పోలింగ్ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ 3 రోజుల పాటు కొనసాగనుంది. అయితే కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు రష్యా పౌరులకు అవకాశం కల్పించారు. రష్యా పౌరులు ఓటు వేసేందుకు తమ దేశానికి వెళ్లకుండా.. కేరళలోనే పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

కేరళ రాష్ట్రంలో రష్యా పౌరులు ఎక్కువగా నివసిస్తున్నందున వారి కోసం ఈ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. రష్యన్‌ ఓటర్లు ఇక్కడి నుంచే తమ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తిరువనంతపురంలోని రష్యన్‌ హౌస్‌ అయిన ఆనరరీ కాన్సులేట్‌ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌లో ఈ రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ సెంటర్‌ను రష్యా అధికారులు ఏర్పాటు చేశారు. కేరళ వ్యాప్తంగా ఉన్న రష్యా పౌరులు ఈ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రష్యన్ హౌస్‌ డైరెక్టర్‌ రతీశ్‌ నాయర్‌ స్పష్టం చేశారు. అయితే ఇలా కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి ఏమీ కాదని.. ఇప్పటికే రెండు సార్లు నిర్వహించామని.. ఇది మూడోసారి అని అధికారులు వెల్లడించారు. కేరళలో స్థిరపడిన రష్యా వాసులు, పర్యటకుల కోసం ఈ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రతీశ్ నాయర్ తెలిపారు. అయితే కేరళలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసేందుకు రష్యా పౌరులు ఆసక్తి చూపిస్తున్నారని.. ఇక్కడి నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మార్చి 15 వ తేదీన ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 17 వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు.