Wednesday, September 25, 2024
HomeUncategorizedకొత్త ఈసీల నియామకాలపై స్టే నిరాకరణ

కొత్త ఈసీల నియామకాలపై స్టే నిరాకరణ

Date:

కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల సంఘం(ఈసీ)లో ఖాళీ అయిన రెండు కమిషనర్‌ పోస్టుల భర్తీకి ఎంపిక కమిటీలో సీజేఐను మినహాయించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త కమిషనర్ల నియామకాన్ని ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023’ ప్రకారం చేపట్టకుండా కేంద్రాన్ని అడ్డుకోవాలని పిటిషనర్లు కోరారు. దీనిపై వచ్చేవారం (మార్చి 21న) విచారణ జరుపుతామని వెల్లడించింది. గత డిసెంబర్‌లో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎంపిక కమిటీలో సీజేఐకు బదులుగా ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. ఈ కొత్త చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌గోయల్‌ ఈనెల 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్‌, సుఖ్బీర్‌తో భర్తీ చేసింది. ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పేర్లకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌చౌధరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ నిన్న దిల్లీలో సమావేశమైంది. అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.