Wednesday, September 25, 2024
HomeUncategorizedయోగీ హయాంలో 10,900 పోలీస్‌ ఎన్‌కౌంటర్లు

యోగీ హయాంలో 10,900 పోలీస్‌ ఎన్‌కౌంటర్లు

Date:

పేద ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకొనేవారికి బతికే హక్కు ఉండదంటూ మాఫియా శక్తులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంబేడ్కర్‌ నగర్‌లో రూ.2,122 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా యోగి మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో భాజపా సర్కారు రాకముందు పేదల భూముల్ని మాఫియా ఆక్రమించేది. ప్రజలు పండుగలు చేసుకోనివ్వకుండా అడ్డుపడేది. ఈరోజు ఏ మాఫియా అయినా పేదల భూమిని ఆక్రమించగలదా? మన ఆడ పిల్లలను ఎవరైనా వేధించగలరా? వారు ఏ బిడ్డనైనా వేధిస్తే పక్క రోడ్డు కూడలిలోనే ‘యమరాజ్‌’ వాళ్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తాడని బాగా తెలుసు” అన్నారు.

మాఫియాపై తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైందా? కాదా? మీరు దాన్ని సమర్థిస్తారా? లేదా చెప్పండి అని యోగి అక్కడ ఉన్న ప్రజల్ని అడిగారు. ఉత్తరప్రదేశ్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండటం వల్లే మాఫియాపై ఈరకంగా వ్యవహరించడం సాధ్యమవుతోందని చెప్పారు. గత ప్రభుత్వాలు తమ నేతల ఆదాయ వనరుల కోసం మాఫియాలను పెంచి పోషించాయని ఆరోపించారు. దేశంలో 2014కు ముందు, యూపీలో 2017కు ముందు తమ గురించి, తమ కుటుంబాల గురించే ఆలోచించే ప్రభుత్వాలు ఉండేవని.. కానీ, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 140కోట్ల మంది ప్రజలు తన కుటుంబమని చెబుతున్నారన్నారు. పోలీసు రికార్డుల ప్రకారం.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి 2023 వరకు రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 180 మందికి పైగా నేరస్థులు హతమయ్యారు. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 10,900 పోలీస్‌ ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 23,300 మంది నేరగాళ్లు అరెస్టు కాగా.. 5,046 మంది గాయపడ్డారు.