Wednesday, September 25, 2024
HomeUncategorizedతెలంగాణ వ్యాప్తంగా మండుతున్న ఎండలు

తెలంగాణ వ్యాప్తంగా మండుతున్న ఎండలు

Date:

ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మార్చి రెండో వారంలోనే సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణాలోని ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల 39డిగ్రీలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మరింత తీవ్రతరం కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణాలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తల మడుగులో 40.5 డిగ్రీలు, నల్గొండ లో 40.9 డిగ్రీలు, సిద్ధిపేటలో 40.8, నిజామాబాద్ లో 40.5, నిర్మల్ జిల్లాలో 40.4, జగిత్యాలలో 40.5, సంగారెడ్డి జిల్లాలో 40.3, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.

ఈనేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఎండలు మండి పోతుండటం, ఉక్కపోత, వేడిగాలుల కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ అయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే ఆహారంలో వీలైనంత వరకూ నీటిశాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.