Wednesday, September 25, 2024
HomeUncategorizedమహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం

మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి, రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వరాలను ప్రకటిస్తూ వస్తోంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తోన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ.. తాజాగా బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలపై వరాల సునామీని కురిపించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే మహిళల కోసం అయిదు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. వాటి వివరాలను ఆయన వెల్లడించారు. మహాలక్ష్మి, జనాభాలో సగం- సంపూర్ణ హక్కు, శక్తి సమ్మాన్, అధికార మైత్రీ, సావిత్రిబాయి ఫులే హాస్టల్.. పథకాలను అమలు చేస్తామని అన్నారు.

  1. మహాలక్ష్మి పథకం: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతి సంవత్సరం కూడా లక్ష రూపాయలు చొప్పున.. అయిదు సంవత్సరాలకు అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేత.
  2. జనాభాలో సగం- సంపూర్ణ హక్కు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే అన్ని శాఖలు, విభాగాధిపతులు, కార్యాలయాల్లో నిర్వహించబోయే కొత్త రిక్రూట్‌మెంట్లల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అన్ని కార్యాలయాలకూ ఇది వర్తింపు.
  3. శక్తి సమ్మాన్: దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడి కార్యకర్తలు, మధ్యాహ్న భోజనాన్ని వండుతున్న మహిళలందరికీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న వేతనాలు రెట్టింపు. ఇప్పుడు కేంద్రం వాటాగా అందుతున్న జీతం మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది కాంగ్రెస్.
  4. అధికార మైత్రీ: దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీలో అధికార మైత్రీ పేరుతో మహిళల నియామకం. గ్రామ స్థాయిలో మహిళలకు దక్కాల్సిన హక్కులు, అధికారాల గురించి తెలియజేయడం, అవి దక్కించుకునేలా మహిళలకు సహకరించడం.
  5. సావిత్రిబాయి ఫులే హాస్టల్: ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే మహిళల సురక్షితమైన నివాస వసతిని కల్పించడంలో భాగంగా సావిత్రి బాయి ఫులే పేరు మీద హాస్టల్ సౌకర్యం కల్పిస్తుంది. ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక హాస్టల్ ఏర్పాటు.