Wednesday, September 25, 2024
HomeUncategorizedగడువులోగా బాండ్ల వివరాలు వెల్లడిస్తాం

గడువులోగా బాండ్ల వివరాలు వెల్లడిస్తాం

Date:

దేశంలోని ఎలక్టోరల్ బాండ్ల కేసుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ‘ప్రజాస్వామ్య పండుగ’లో ఉత్సాహంగా పాల్గోవాలని అభ్యర్థిస్తున్నట్లు సీఈసీ అన్నారు. ‘2024 ఫిబ్రవరి 15, మార్చి 11 నాటి ఆర్డర్‌లో (2017 WPC NO.880 విషయంలో) ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, మార్చి 12న ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘానికి ఎస్‌బీఐ అందించింది’ అని ఎన్నికల సంఘం మంగళవారం పోస్ట్ చేసింది.

మరోవైపు 2019 నుంచి 2024 వ‌ర‌కు సుమారు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసిన‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇందులో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బాండ్ల డేటాను స‌మ‌ర్పించిన‌ట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ స‌మాచారాన్ని పెన్‌డ్రైవ్‌లో ఈసీకి అందించినట్లు చెప్పింది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్షన్‌తో కూడా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అయితే మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.