బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారి తెలిపారు. నిందితుణ్ని షబ్బీర్గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం.
ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేశారు.