సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్’ రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆవిష్కరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కంపెనీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘డెవిన్’ అత్యాధునికమైనదని, ప్రముఖ ఏఐ కంపెనీల నుంచి ప్రాక్టికల్ ఇంజినీరింగ్ ఇంటర్య్వూలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. ”ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుంది. వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది అని కంపెనీ పేర్కొంది.
కష్టమైన ఇంజినీర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్లాన్‌లు అమలుచేయగల అద్భుతమైన సామర్థ్యం ‘డెవిన్’కు ఉందని కంపెనీ వెల్లడించింది. సొంత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే కాకుండా తన తప్పుల్ని తానే సరిదిద్దగలదని తెలిపింది. యూజర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకొని వారి అభిరుచి మేరకు మెరుగైన సేవలు అందిస్తుందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రపంచంలో ఇది గేమ్ ఛేంజర్ కానుందని తెలిపింది. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను తీసుకురావడంపై కంపెనీ స్పందించింది. ఉద్యోగులను ఏఐ ఇంజినీర్లతో భర్తీ చేయాలనే ఉద్దేశం తమకు లేదని కేవలం వారి పనుల్ని సులభతరం చేయడంలో భాగంగా మాత్రమే దీన్ని రూపొందించామని తెలిపింది.