Monday, December 23, 2024
Homeక్రైంమినీ బస్సుపై దోపిడీ దొంగల కాల్పులు

మినీ బస్సుపై దోపిడీ దొంగల కాల్పులు

Date:

సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై చోరీకి ప్రయత్నించి డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపకుండా 30 కి.మీ. నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అందులోనివారంతా అమరావతి నుంచి నాగ్‌పుర్‌కు వెళ్తుండగా నంద్‌గావ్ పేత్ సమీపంలోని హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.

డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే తెలిపిన వివరాల ప్రకారం ”అమరాతిలోని ఆలయాన్ని దర్శించుకొని ప్రయాణికులతో నాగ్‌పుర్‌కు తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి వెనక బొలెరో కారు మమ్మల్ని . వెంబడిస్తుంది. వారికి వెళ్లడానికి రెండుసార్లు దారి ఇచ్చినా ముందుకువెళ్లకుండా వెనకే వచ్చారు. వాహనం నంబర్‌ సరిగ్గా గుర్తు లేదు కాని అది యూపీకి చెందినది.” అని తెలిపారు. కొంతసేపటికి బస్సు ముందుకువచ్చిన దుండగులు కారులో నుంచే తనపై కాల్పులు జరిపారని తెలిపారు. మొదటిసారి తప్పించుకోగలిగినా, రెండోసారి తన చేతిపై కాల్చారన్నారు. ప్రయాణికులను వారినుంచి ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే 30కి.మీ. బస్సును నడిపి పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లానని వివరించారు. డ్రైవర్‌ చూపిన తెగువకు ప్రయాణికులు అతడిని ప్రశంసించారు. ఆయన వల్లే తాము దోపిడీ దొంగలకు చిక్కకుండా సురక్షితంగా బయటపడ్డామన్నారు.