Tuesday, September 24, 2024
HomeUncategorizedతన జీవితం రైలు పట్టాలపైనే ప్రారంభం

తన జీవితం రైలు పట్టాలపైనే ప్రారంభం

Date:

తన జీవితం రైలు పట్టాలపై ప్రారంభించానంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన గతాన్ని గుర్తు చేసుకొన్నారు. అందుకే అక్కడ ఉండే కష్టాల గురించి బాగా తెలుసన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు మంగళవారం మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశం కోసమే తప్ప.. రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు మా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఓట్ల కోసమే భాజపా సర్కారు ఈ చర్యలను చేపట్టిందంటూ కొందరు తప్పుపడుతున్నారు. అవన్నీ ఆరోపణలు మాత్రమే. నా జీవితాన్ని రైలు పట్టాలపైనే ప్రారంభించా. గతంలో మన రైల్వేల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉండేది. అందుకే ఆ కష్టాల గురించి నాకు బాగా తెలుసు. గత తరాలు అనుభవించిన బాధలను భవిష్యత్తు తరాలకు ఇవ్వకుండా ఉండడమే మోడీ గ్యారెంటీ” అని అన్నారు.

పదేళ్లుగా రైల్వేల అభివృద్ధికి భాజపా ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. గతంతో పోలిస్తే ఆరింతల అధిక మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేవలం రెండు నెలల్లోనే రూ. 11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు/శంకుస్థాపనలు చేశామని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను నిలిపివేసి కేంద్ర బడ్జెట్‌లో చేర్చామని.. దీన్ని వల్ల ప్రభుత్వ నిధులు రైల్వేల అభివృద్ధికి వినియోగించేలా తోడ్పడుతుందని అన్నారు. అయోధ్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 350 ఆస్తా రైళ్ల ద్వారా ఇప్పటివరకు 4.5లక్షల మందికి శ్రీరాముడి దర్శనం కల్పించామని అన్నారు.