Tuesday, September 24, 2024
HomeUncategorizedభారతీయ యువత చూపు అమెరికా వైపే

భారతీయ యువత చూపు అమెరికా వైపే

Date:

ఉన్నత చదువులు చదవాలి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అంటూ ఏటా లక్షల మంది భారతీయ యువత విదేశీబాట పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తొలి ప్రాధాన్యంగా అమెరికానే ఎంచుకుంటున్నారు. అగ్రరాజ్యంలో అడుగుపెడుతోన్న వారి సంఖ్య దశాబ్దికాలంలో 8 రెట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం 2022-23 విద్యా సంవత్సరంలోనే వీరి సంఖ్య 35శాతం పెరిగింది. మరే దేశం కూడా భారతీయ విద్యార్థులను ఈ స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందని ఇందుకు పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అడ్మిషన్‌ పొందడం సులువు

భారత్‌లో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించడం కంటే అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ పొందడం సులువుగా మారింది. ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాల ఆమోదం రేటు 0.2 శాతంగా ఉండగా.. అమెరికాలో పేరుగాంచిన హార్వర్డ్‌ యూనివర్సిటీ (3శాతం), మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లోనే (4శాతం) అధికంగా ఉండటం గమనార్హం. సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎక్కువమంది ఉన్నత విద్యనభ్యసిస్తుండగా.. యూజీ ప్రోగ్రామ్‌ల వైపు భారత మధ్యతరగతి యువత ఆసక్తి చూపడం క్రమంగా పెరుగుతోంది.

చైనాను దాటుతున్న భారతీయ యువత

దాదాపు 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు అంచనా. వీరిలో కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాల వైపు అధికంగా చూస్తున్నప్పటికీ అగ్రరాజ్యంతో పోల్చితే తక్కువే. కేవలం అమెరికాలోనే ప్రస్తుతం 2,69,000 మంది చదువుతున్నారు. ఒక్క 2022-23 విద్యా సంవత్సరంలోనే ఈ సంఖ్య 35శాతం పెరగడం గమనార్హం. అమెరికా యూనివర్సిటీల్లో ఇప్పటివరకు చైనా విద్యార్థులే అధికశాతం ఉండగా.. తాజాగా భారత్‌ ఆ స్థానాన్ని అధిగమించేలా దూసుకెళ్తోంది. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, డల్లాస్‌లలో చైనా విద్యార్థుల సంఖ్య 1200 నుంచి 400లకు పడిపోగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం 3,000 నుంచి 4,400లకు పెరగడం స్పష్టమవుతోంది.

విద్యార్థులకు మంచి అవకాశాలు

అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి భారీగా ట్యూషన్‌ ఫీజులు వసూలు చేసే అమెరికా కాలేజీలకు ఆర్థిక వనరుగా మారుతోంది. దీంతో భారత్‌లోని టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాలపై దృష్టి పెడుతోన్న అమెరికా విద్యాసంస్థలు.. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ కార్యక్రమాల ద్వారా భారత్‌తో బంధాలను మరింత పెంచుకుంటున్నాయి.