Tuesday, September 24, 2024
HomeUncategorizedబెంగళూరులో వాటర్‌ మాఫియాకు అడ్డుకట్ట వేస్తాం

బెంగళూరులో వాటర్‌ మాఫియాకు అడ్డుకట్ట వేస్తాం

Date:

వేసవికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే నీటి సంక్షోభంతో బెంగళూరు ప్రజలు నిత్యం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నీటి డిమాండ్‌ను తీర్చడంతో పాటు వాటర్‌ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితిని గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు. వచ్చే రెండు నెలలు చాలా కీలకం. ఆ సమయంలో నీటి డిమాండ్‌ను తీర్చేందుకు కాంగ్రెస్‌ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది. బెంగళూరు నగరంలో వాటర్‌ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు యత్నిస్తోంది. నీటి ధరలను ప్రామాణికంగా ఉంచేందుకు అన్ని నీటి ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని కోరాం. ఇప్పటివరకు 1,500 ప్రైవేటు ట్యాంకర్ల వివరాలు నమోదయ్యాయి” అని అన్నారు.

ఇప్పటికే నగరంలో 13,900 బోర్‌బావులుండగా.. వీటిలో 6,900 ఎండిపోవడం నీటి సంక్షోభానికి అద్ధం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల అవసరాన్ని తీర్చేందుకు బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో 240 తాలూకాల్లో 223ను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 196 తాలూకాల్లో తీవ్ర స్థాయిలో కరవు పరిస్థితి నెలకొంది. నీటి సంక్షోభం నేపథ్యంలో బోర్‌బావుల తవ్వకాలపై బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ షరతులు విధించింది. నగర పరిధిలో అనుమతి లేకుండా బోర్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. బోర్ల కోసం తొలుత ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి అనుమతిస్తారు. వాహనాలను శుభ్రం చేసేందుకు, వినోదాలకు ఇలా అనవసరాలతో నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది