Tuesday, September 24, 2024
HomeUncategorizedఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం

ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం

Date:

బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని, ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో కేసీఆర్‌ పదేళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజల బాధలు చూసే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురుచూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకూ పట్టాలు ఇస్తాం. భారాస ప్రభుత్వం పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయింది. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్‌ మోసం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. పదేళ్ల పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పు చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు. మేం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాం” – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి