Friday, September 20, 2024
Homeక్రైంసుప్రీంకోర్టులో సాయిబాబాకు ఊరట

సుప్రీంకోర్టులో సాయిబాబాకు ఊరట

Date:

భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులు హేతుబద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వ అప్పీలును విచారణకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

వీలైనంత తొందరగా ఈ పిటిషన్‌ను లిస్టింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు చేసిన మౌఖిక విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని తెలిపింది. నిర్ణీత సమయంలోనే ఈ పిటిషన్‌ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం కొట్టివేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది.