Tuesday, September 24, 2024
HomeUncategorizedబీజేపీలో చేరకుంటే దర్యాప్తు సంస్థలతో దాడులే

బీజేపీలో చేరకుంటే దర్యాప్తు సంస్థలతో దాడులే

Date:

ప్రతిపక్ష నేతలను ఎలాగైనా తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ఒకవేళ ఎవరైనా చేరని పక్షంలో వారిపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే శ్రీరాముడు ఈ యుగంలో పుట్టి ఉంటే.. ఆయన ఇంటికి కూడా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను కేంద్ర ప్రభుత్వం పంపించేదని అన్నారు. అంతే కాకుండా ఆయన తలకు తుపాకీ గురి పెట్టి.. బీజేపీలో చేరడమో లేక జైలుకు వెళ్లడమే ఏదో ఒకటి చేయాలని ఒత్తిడి తెచ్చేదని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌పై శనివారం నాడు జరిగిన చర్చలో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం బడ్జెట్‌పై చర్చిస్తున్నామని.. ఈ సమయంలో తన చిన్న తమ్ముడు మనీష్ సిసోడియా గుర్తుకొస్తున్నారని కేజ్రీవాల్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 9 బడ్జెట్‌లను మనీష్ సిసోడియా ప్రవేశపెట్టారని.. ఇది 10 వ బడ్జెట్ అని తెలిపారు. ఇక ఇదే ఢిల్లీ అసెంబ్లీలో వచ్చే ఏడాది 11వ బడ్జెట్‌ను మనీష్ సిసోడియా ప్రవేశపెడతారని ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఆయన పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

దేశంలోని ప్రతిపక్ష నేతలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందంటూ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర సంస్థలు, డబ్బులతో కూల్చుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఒకవేళ శ్రీరాముడే ఈ కాలంలో పుట్టి ఉంటే.. ఆయనను కూడా బీజేపీలో చేరతావా లేక జైలుకు వెళ్తావా అని ఒత్తిడి తీసుకువచ్చేదని ఆరోపించారు. శ్రీరాముడి ఇంటికి కూడా ఈడీ, సీబీఐలను బీజేపీ పంపి ఉండేదని చురకలు అంటించారు.