Tuesday, September 24, 2024
HomeUncategorizedఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకునే వారిని శిక్షించండి

ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకునే వారిని శిక్షించండి

Date:

ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకునే వారిని గుర్తించి తగినవిధంగా శిక్షించండి. నా కుటుంబంగా భావించే ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు అన్నివిధాలా కృషి చేశా. పార్లమెంటులోనూ కేజ్రీవాల్‌ ఉంటే.. ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది అనేది మా నినాదం” అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సైరన్‌ మోగనుండటంతో ప్రచారంపై పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఢిల్లీ డీడీయూ మార్గ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఎన్నికల ప్రచార నినాదాన్ని ప్రకటించారు.

‘ఒక సామాన్యుడికి ఢిల్లీ అధికారం కట్టబెట్టారు. అందుకే మీరంటే వారికి (బిజెపి) ద్వేషం. మొహల్లా క్లినిక్‌లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇంటింటికీ రేషన్‌, వైద్య పరీక్షలు, ఔషధాలు పంపిణీ చేసే పథకాలను నిలిపివేశారు. ఆప్‌ ప్రభుత్వం ప్రారంభించే ప్రతి ప్రాజెక్టును ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం చేసిన పనుల కరపత్రాలను ఆప్‌ కార్యకర్తలు పంపిణీ చేస్తారని అన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలను ఆప్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటే నిధులను ఆపేందుకు ఎవరూ సాహసం చేయరన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీ, గుజరాత్‌, హరియాణాలలో పోటీ చేస్తున్నామని.. పంజాబ్‌లో మాత్రం వేర్వేరుగా బరిలో నిలుస్తున్నట్లు చెప్పారు.