Tuesday, September 24, 2024
HomeUncategorizedరాజ్యసభకు నామినేట్ ఐనా సుధా మూర్తి

రాజ్యసభకు నామినేట్ ఐనా సుధా మూర్తి

Date:

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, సామాజిక ఉద్యమ కార్యకర్త సుధా మూర్తిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో ఆమెను పెద్దల సభకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం పంపించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ గెజిట్‌ను విడుదల చేసింది. సుధా మూర్తి స్వరాష్ట్రం.. కర్ణాటక. ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఉన్నారు.

సుధామూర్తి.. రాజ్యసభకు ఎంపికైన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా లోకానికి చిరు కానుకగా అభివర్ణించారు. పెద్దల సభకు సుధా మూర్తి ఎంపిక కావడం నారీ శక్తికి అద్దం పట్టినట్టయిందని మోడీ వ్యాఖ్యానించారు. సామాజిక, విద్యా రంగాల్లో సుధామూర్తి చేస్తోన్న సేవలను దృష్టిలో ఉంచుకుని.. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలని రాష్ట్రపతి నిర్ణయించినట్లు తెలిపారు. విభిన్న రంగాల అభ్యున్నతి కోసం సుధా మూర్తి అపారమైన కృషి చేశారని కితాబిచ్చారు. ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని మోదీ ప్రశంసించారు. సుధా మూర్తి రాజ్యసభలో అడుగు పెట్టడం మహిళల శక్తికి నిలువుటద్దమని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ పదవీకాలంలో అందరికీ ఆదర్శనంగా నిలుస్తారని, ఆమె జీవితంలో రాజ్యసభ పదవీ కాలం అత్యుత్తమంగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ అన్నారు.