మంచుకొండల్లో వెలిసిన ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 10వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్‌కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.