Monday, December 23, 2024
Homeక్రైంస్నేహితురాలు పిలుస్తుందంటూ వివాహిత ఆత్మహత్య

స్నేహితురాలు పిలుస్తుందంటూ వివాహిత ఆత్మహత్య

Date:

మరణించిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి తనను రమ్మంటోందని ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జరిగింది. ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన పోచంపల్లి కిష్టయ్య కూతురు రాధిక(33)ను 15 సంవత్సరాల కిందట ఖిలాషాపురం గ్రామానికి చెందిన యామంకి సుధాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. వీరంతా అన్యోన్యంగా జీవించేవారు. సదరు మహిళ బుధవారం తన సోదరుడు శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడింది.

మూడు సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకున్న స్వగ్రామంలో తనతో అన్యోన్యంగా ఉండే స్నేహితురాలు ఇటీవల తరచూ తన కలలోకి వచ్చి తన దగ్గరికి రావాలంటోందని అతనికి చెప్పింది. తనకు భయంగా ఉందని సోదరుడుకి తెలిపింది. వీటిని పట్టించుకోవద్దని ఆయన చెల్లెలు రాధికకు ధైర్యం చెప్పారు. భయాందోళనకు గురైన రాధిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న మృతురాలి అన్నయ్య, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు మహిళలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వివాహ అనంతరం అందులో ఓ స్నేహితురాలు వేరే ఊరిలో స్థిరపడింది. వారు ఇద్దరు స్వగ్రామానికి వచ్చినప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేవారు. కానీ, ఇంతలోనే ఊహించని విధంగా రాధిక స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాధిక.. ఆమెను తలుచుకొని బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే మృతి చెందిన మహిళ, తన కలలోకి వచ్చి తన దగ్గరకి రావాలని చెబుతోందని వాపోయింది. ఈ క్రమంలోనే రాధిక ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.