Monday, December 23, 2024
Homeక్రైంఅతడి ఆచూకీ చెపితే రూ.10 లక్షల రివార్డు

అతడి ఆచూకీ చెపితే రూ.10 లక్షల రివార్డు

Date:

బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో నిందితుడి ఫొటోను ఎన్‌ఐఏ అధికారులు విడుదల చేసారు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఈ కింది పేర్కొన్న అడ్రస్‌/ఫోన్‌ నంబర్‌కు సమాచారం చెప్పాలని కోరింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్‌ దేశాన్ని కలవరపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్‌ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్‌ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. అతడిని ప్రధాని అనుమానితుడిగా గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు.. సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని తాజాగా ప్రకటించారు.