Friday, September 20, 2024
Homeక్రైం30 సంవత్సరాలకు న్యాయం దొరికింది

30 సంవత్సరాలకు న్యాయం దొరికింది

Date:

ఒక వ్యక్తి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా 30 సంవత్సరాలు పట్టింది. ఇన్నేళ్ల సుదీర్ఘపోరాటం తర్వాత ఆ వ్యక్తికి న్యాయం దొరికింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. హరియాణాకు రాష్ట్రానికి చెందిన నరేష్‌ కుమార్ భార్య 1993లో ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె భర్త నరేష్‌తోపాటు అత్తమామలు డబ్బుల కోసం ఆమెను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావడంతో నరేశ్ పై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు 1996లో నరేశ్ ను దోషిగా నిర్దారించింది. ట్రయల్ కోర్టు తీర్పుపై నరేష్‌ పంజాబ్ , హరియాణా హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు సైతం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2008లో నరేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును, శిక్షను రద్దు చేస్తూ.. నరేష్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తను దోషిగా తేల్చడానికి అతడు వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సరిపోవని స్పష్టం చేసింది. నేరం చేసినవారు శిక్ష పడకుండా తప్పించుకోకూడదని, అదే సమయంలో చేసిన నేరాలకు చట్టపరమైన సాక్ష్యాల ఆధారంగానే నిందితులకు శిక్షను నిర్ధరించాలని తెలిపింది. పిటిషన్ దారుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే కేసు 1993లో మొదలై 2024వ సంవత్సరంలో ముగిసింది. అంటే దాదాపు 30 ఏళ్లు అతడు ఈ బాధను అనుభవించాడు. అదే సమయంలో సదరు ఆత్మహత్య చేసుకున్న మహిళ తన ఆరునెలల చిన్నారిని వదిలి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు కోణాల్లోనూ లోతుగా ఆలోచించి ఈ తీర్పు ఇచ్చాం. నిజానికి, మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన ప్రత్యక్ష, పరోక్ష కారణాలు చాలా అవసరం. వివాహిత ఆత్మహత్యకు వేధింపులే కారణమని ఊహించకూడదు.. అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.