Sunday, December 22, 2024
Homeక్రైంఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

Date:

ఇటీవల ముంబైలో వీల్‌చైర్‌ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఫిబ్రవరి 16న 80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్‌ ఇండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబై చేరుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన ఆ విమానం నుంచి టెర్మినల్‌ వరకు ఆయనకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో కొంత దూరం నడిచిన ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ సంఘటనపై డీజీసీఏ స్పందించింది. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఈ సంఘటనపై ఎయిర్‌ ఇండియా వివరణ ఇచ్చింది. ఆ ప్రయాణికుడి భార్యకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వీల్‌చైర్స్‌ కొరత వల్ల ఏర్పాటు చేసే వరకు వేచి ఉండాలని ఆ వృద్ధుడ్ని కోరినట్లు చెప్పింది. అయితే వీల్‌చైర్‌లో ఉన్న భార్యతో కలిసి తాను నడిచి వెళ్తానని అతడు చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్‌ ఇండియా వివరణపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీల్‌చైర్‌ అవసరమైన దివ్యాంగుల పట్ల ఆ సంస్థ వ్యవహరించిన తీరుపై మండిపడింది. సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే వీల్‌చైర్‌ ప్రయాణికులకు వాటిని సమకూర్చడంపై విధి విధానాలు తప్పక పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.