భారత్‌లో ఆన్‌లైన్ సర్వీసుల్లో అన్ని వస్తువులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. పెరుగుతున్న డిజిటల్ వేదికలతో సైబర్ నేరగాళ్లు కూడా అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేదికగా రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా స్కామ్‌తో అమాయకులకు టోకరా వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా గురుగ్రాంకు చెందిన డెయిరీ రైతు ఆన్‌లైన్‌లో ఆవులు కొనుగోలు చేస్తూ రూ. 22,000 పోగొట్టుకున్నాడు. పండాలాలో నివసిచే సుఖ్బీర్ (50) అనే రైతు ఆన్‌లైన్ స్కామ్‌లో మోసపోయాడు. ఆఫ్‌లైన్ రేట్స్‌తో పోలిస్తే చాలా తక్కవ ధరకు ఆన్‌లైన్‌లో ఆవులను విక్రయించే ప్రకటన సుఖ్బీర్ చూశాడు. ఈ డీల్ గురించి తన తండ్రి ఆరా తీయడంతో ఆయన వాట్సాప్‌కు ఆవుల ఫొటోలు పంపారని, ఒక్కో ఆవును రూ. 35,000కు విక్రయిస్తామని ఆఫర్ చేశారని సుఖ్బీర్ కుమారుడు ప్రవీణ్ వెల్లడించాడు.
అయితే నాలుగు ఆవులు కొనుగోలు చేస్తానని తన తండ్రి తెలుపగా వారు ధరను రూ.95,000కు తగ్గించారని చెప్పాడు. ఆ ఆవులు గోశాలలో నమోదయ్యాయని తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఇది సరైన డీల్ అనుకున్న సుఖ్బీర్ జనవరి 19, 20 మధ్య రూ. 22999 విలువైన లావాదేవీలు జరిపాడు. స్కామర్లు మరింత డబ్బు డిమాండ్ చేయడం, వాస్తవంగా ఆవులు కొనుగోలు చేసేందుకు లేకపోవడంతో అనుమానం వచ్చిన సుఖ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగుచూసింది.