Sunday, December 22, 2024
Homeక్రైంబతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేశారు

బతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేశారు

Date:

కొంతమంది అధికారులు అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. బతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేసి, నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా స్వాహా చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా డబ్బులు కాజేసిన కొందుర్గు మండల వ్యవసాయ అధికారి గోరేటి శ్రీశైలంను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, తంగళ్ళపల్లి, అగిర్యాల,చిన్న ఎల్కిచేర్ల గ్రామాలకు ఇంచార్జిగా ఉన్న శ్రీశైలం.. బతికున్న20 మంది రైతులను చంపేసి వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బీమా తీసుకున్నారని తెలిపారు. రెండు వేల మంది అమాయక రైతుల డేటాను సేకరించినట్లు గుర్తించామని అవినాష్ మొహంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరణించిన రైతులకు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తోంది. అయితే దీనిని అవకాశంగా మలుచుకున్న కొందుర్గు మండల వ్యవసాయ శాఖలోని అధికారులు తమ పరిధిలోని 20 మంది రైతుల వివరాలను సేకరించి వారు మరణించినట్లుగా తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని దాదాపుగా కోటీ రూపాయిలు స్వహా చేశారు.

రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఆ క్లెయిమ్​ల చెల్లింపులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబయిలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలోనే రైతు బంధు నిధులు రూ.కోటి పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన ఈ వ్యవహారంలో అధికారి గోరేటి శ్రీశైలంతో పాటు ఓదెలా వీరస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.