Monday, September 23, 2024
HomeUncategorizedఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం..?

ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం..?

Date:

దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకునేలా చూడాలంటూ ఆ పార్టీ అధిష్టానం నుంచి రేవంత్ కు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని అగ్రనేతలు సూచించారంటున్నారు. మరోవైపు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతను రేవంత్ కు అప్పగించింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో ఇంత క్రమశిక్షణ ఉంటుందని తాము గతంలో ఎన్నడూ ఊహించలేదని సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీపై రేవంత్ దృష్టిపెడితే కొంత మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అక్కడి ముఖ్యమంత్రి జగన్ తో పోల్చుకుంటే రేవంత్ ప్రసంగం చాలా దూకుడుగా ఉండటంతోపాటు పంచ్ డైలాగులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటే ఏపీలో ఉన్న అతని అభిమానులతోపాటు యువతలో కూడా మార్పు వస్తుందని, వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల విషయంలో ఏపీకి అనుకున్నంత సహాయం కేంద్రం నుంచి అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంటున్నారు. ఆమె ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ గా చేసుకొని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ ఏపీలోకి అడుగుపెడితే జగన్ ను టార్గెట్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. రేవంత్ కూడా షర్మిల బాటలోనే పయనిస్తారా? విపక్షాలపై పదునైన పదజాలంతో విరుచుకుపడతారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.