Monday, September 23, 2024
HomeUncategorizedపెద్దల సభలోకి సోనియా, నడ్డా

పెద్దల సభలోకి సోనియా, నడ్డా

Date:

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఇప్పుడు పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్‌ నుంచి ఆమె రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్‌ నుంచి ఎలాంటి పోటీ లేకుండానే ఎగువ సభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగిసింది. రాజస్థాన్‌ నుంచి ఖాళీ కానున్న మూడు స్థానాలకు కాంగ్రెస్‌ నుంచి సోనియాగాంధీ, బిజెపి నుంచి చున్నిలాల్‌ గరాసియా, మదన్‌రాథోడ్‌ నామినేషన్‌ వేశారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌కు ఆరు, బిజెపికి నలుగురు సభ్యులున్నారు. అటు గుజరాత్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో నడ్డా సహా అధికార బిజెపికి చెందిన నలుగురు పోటీకి దిగారు. ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 2012, 2018లో నడ్డా హిమాచల్‌ ప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అక్కడ బిజెపికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో పార్టీ ఆయనను గుజరాత్‌కు మార్చింది.