Sunday, September 22, 2024
HomeUncategorizedఅయోధ్యలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

అయోధ్యలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Date:

అయోధ్య రామ మందిరంలో కొలువైన బాల రాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో బాలరాముడి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయం వద్ద క్యూ మేనేజ్ మెంట్ నిర్వహణ, ఇతర సౌకర్యాల ఏర్పాటులో సాంకేతిక సాయం అందించాలని, భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలని అయోధ్య రామమందిర ట్రస్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరింది. దీంతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు భక్తుల రాక నియంత్రణ, క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

బాలక్‌ రామ్‌కు రోజూ మధ్యాహ్నం ఓ గంట సేపు విశ్రాంతి ఇవ్వనున్న విషయం తెలిసిందే. రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు బాల రాముడికి విశ్రాంతి ఇస్తున్నారు. ఆ సమయంలో దేవాలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. బాలక్‌ రామ్‌ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు దర్శనానికి అనుమతించేవారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో దర్శనం వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. బాలక్‌రామ్‌కు తెల్లవారు జామున 4 గంటల నుంచి రెండు గంటల సేపు హారతి, అర్చన నిర్వహిస్తున్నారు.