Sunday, September 22, 2024
HomeUncategorizedశరీరానికి 20నిమిషాలు ఎండ తాకాలి

శరీరానికి 20నిమిషాలు ఎండ తాకాలి

Date:

మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. మంచి పోషకాహారం తినేవారికి అనారోగ్యాల ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు లభించే ఆహారం తింటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. దీంతో శరీరం అనారోగ్యాలను ఎదుర్కొనేలా తయారవుతుంది. అయితే కొన్ని రకాల విటమిన్లు కేవలం ఆహారంతోనే అందవు. ఇలాంటి వాటిలో విటమిన్‌ డి ప్రధానమైనది. దీన్ని మన శరీరం ఎండ నుంచి తయారు చేసుకుంటుంది. అయితే ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

శరీరం సిర్కాడియన్ రిథమ్ (నిద్ర, మేల్కొనే చక్రం)ను అనుసరించడంలో సూర్యరశ్మి పాత్ర కీలకం. నిద్ర, పేగు ఆరోగ్యానికి మధ్య డైరెక్ట్ సంబంధం ఉంది. నాణ్యమైన నిద్ర పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే గట్ హెల్త్, మానసిక స్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే శరీరానికి తగినంత ఎండ అవసరం.

*చాలా ప్రయోజనాలు..

సాధారణంగా ప్రతి రోజులో కనీసం 10 నుంచి 30 నిమిషాల సమయం ఎండకు గడపడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలకమైన విటమిన్-డి పుష్కలంగా లభిస్తుందన్నారు. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. అయితే ఎండకు ఎంత సమయం ఉండాలన్నది వ్యక్తులు, ఆరోగ్య పరిస్థితులు, భౌగోళిక లొకేషన్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు.

*ముదురు రంగు చర్మం వారు 30 నిమిషాలు

జనరల్ ఫిజిషియన్, న్యూట్రిషన్ కోచ్ డాక్టర్ నిర్మలా రాజగోపాలన్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో మాట్లాడుతూ, 20-నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండటం అనేది ప్రతిరోజూ 12 గంటల సూర్యకాంతి ఉండే ఉష్ణమండల వాతావరణం ప్రాంతాల ప్రజలకు వర్తిస్తుందన్నారు. ముదురు రంగు చర్మం ఉన్నవారికి రోజుకు కనీసం 30 నిమిషాల సూర్యకాంతి అవసరమని చెప్పారు. వీరిలో మెలనిన్ ఎక్కువగా ఉంటుందని, ఇది సూర్యరశ్మిని పీల్చుకోవడానికి నిరోధకతను కలిగిస్తుందని తెలిపారు.

*ఎండలో ఎక్కువ ఉన్న రిష్క్

విటమిన్ డి కోసం రోజులో కనీసం 20 నిమిషాల పాటు ఎండకు తిరగాలని నిపుణులు సిఫార్సు చేశారు. అయితే ఎక్కువ సమయం సూర్యరశ్మికి ఉంటే చర్మానికి హాని కలగవచ్చు. ఇది చర్మ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ సమయం ఎండకు తిరగాల్సి వస్తే సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు సన్‌స్క్రీన్ వాడటం, రక్షిత దుస్తులను ధరించడం వంటి చర్యలు తీసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా సూర్యరశ్మి నుంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. శీతల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండొచ్చు. విటమిన్ డి వీరి శరీరంలో సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వడానికి రోజుకు కనీసం రెండు గంటల సమయం ఎండకు తిరగాల్సి ఉంటుంది.