Sunday, September 22, 2024
HomeUncategorizedనిరసనలో పాల్గొన్న వృద్ధ రైతుకు గుండెపోటు

నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతుకు గుండెపోటు

Date:

ఢిల్లీలో రైతుల నిరసనలో పాల్గొన్న ఒక వృద్ధ రైతు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతమైన శంభులో ఈ సంఘటన జరిగింది. కనీస మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి పెద్ద ఎత్తున నిరసనకు ఢిల్లీ బాటపట్టారు. అయితే హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు. శుక్రవారం ఉదయం 78 ఏళ్ల రైతుకు గుండెపోటు వచ్చింది. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు రాజ్‌పురాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర ఆసుపత్రికి అతడ్ని రిఫర్ చేశారు. అక్కడకు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా ఆ వృద్ధ రైతు మరణించాడు. మృతుడ్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్‌గా గుర్తించారు. తొలి విడత నిరసనలో కూడా పలువురు రైతులు చనిపోయారు.

మరోవైపు చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. రైతుల డిమాండ్లపై ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుగనున్నాయి.