Sunday, December 22, 2024
HomeUncategorizedహైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎవరి చేతుల్లోకి

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎవరి చేతుల్లోకి

Date:

గత డిసెంబర్లో ఎన్నికల కారణంగా జరగాల్సిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్నది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీలో సభ్యుడిగా ఉన్న బెజవాడ బుక్ ఫెయిర్ కీలక వ్యాపారి హైదరాబాద్ బుక్ సొసైటీలో తెర వెనుక, ముందు కీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ బుక్ ఫేర్ కార్య నిర్వాహక సమావేశానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడి కానప్పటికీ సమావేశానికి వచ్చి అన్నీ తానై మొత్తం కమిటీనే డమ్మీ చేసే విధంగా వ్యవహరించారు. ఆయన ఈ సమావేశానికి హాజరు కావటాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించినప్పటికీ సమావేశం నుండి వెళ్లిపోలేదు. ఇప్పటికే విజయవాడ బుక్ ఫెయిర్ లో ప్రజాశక్తి,విశాలాంద్ర సంస్థల ప్రతినిధులైన అధ్యక్ష, కార్యదర్శులు ఆ ప్రముఖుడి చెప్పు చేతుల్లోనే పనిచేస్తున్నారు. నిర్వాహకులు పేరుకు వామపక్షవాదులైనప్పటికీ విజయవాడ బుక్ ఫేర్ చాగంటి కోటేశ్వరరావు వంటి వారి బొమ్మలతో నింపి బ్రాహ్మణీయ భావజాలాన్ని బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నారని బెజవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా అభ్యుదయవాదులు, అంబేడ్కరిస్టులు బహిరంగంగానే విమర్శలు చేశారు. రచయితలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక మూలన పడేశారని సోషల్ మీడియాలో బహిరంగంగానే విమర్శలు వచ్చాయి.


తెలుగు రాష్ట్రాలలో పుస్తక రంగంలో కార్పొరేట్ శక్తిగా ఎదిగిన పెద్దమనిషికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ కి సభ్యుడిగా ఎన్నుకున్నారు. రెండు రాష్ట్రాలలో అనేకమంది ఉన్నతాధికారుల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలోని మంత్రులతో ఉన్న సంబంధాల ఆధారంగా ఇటీవల జరిగిన విజయవాడ బుక్ ఫెస్టివల్ కు 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం వలన ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు వెళ్లడం కోసం, తన ఇన్ఫ్లుయెన్స్ (ప్రభావం) పెంచుకునేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను వేదికగా మలుచుకునేందుకే ఆ ప్రముఖుడి ప్రయత్నాలని బుక్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఒకరిద్దరు పాఠ్యపుస్తకాల వ్యాపారం ఉన్న దిగ్గజాల చేతుల్లోకి, ఆంధ్ర కార్పొరేట్ చేతుల్లోకి పోతదేమోనని కూడా తెలంగాణ వాదులు చర్చించుకుంటున్నారు.


కొస మెరుపు :
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన బుక్ సొసైటీ విస్మరించిన తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులను గత పది ఏళ్లలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ వెలుగులోకి తెచ్చి కొత్త తరానికి పరిచయం చేసింది. మగ్దుమ్ మొహిద్దిన్, దాశరధి, సుద్దాల హనుమంతు, అలిశెట్టి ప్రభాకర్, చిందు ఎల్లమ్మ, మిద్దె రాములు వంటి అనేకమంది ప్రముఖుల పేర్లతో ప్రాంగణాలు, వేదికలు ఏర్పాటు చేసి పుస్తక ప్రదర్శన ఉత్సవం లాగా సాగింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత పదేళ్ల ట్రెండు కొనసాగుతుందో, లేదో చూడాలి.