కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమం జరుగనున్నది. రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియామకమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్నారైలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్‌లో, సెప్టెంబర్ 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని తెలిపారు. డల్లాస్‌లో టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులతో, విద్యా సంఘం ప్రతినిధులతో కలిసి సంభాషించనున్నట్లు తెలిపారు.
పలువురు సాంకేతిక నిపుణులను కలువనున్నట్లు తెలిపారు. రెండోరోజు వాషింగ్టన్ డీసీకి వెళ్తారని చెప్పారు. అక్కడ థింక్ ట్యాంక్స్, నేషనల్ ప్రెస్ క్లబ్‌తో పాటు పలువురితో సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటన చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన తల్లి సోనియా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్ బరేలీతో పాటు కేరళ వయనాడ్‌లోని లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి గెలిచి లోక్‌సభకు వెళ్లారు.