Tuesday, October 15, 2024
HomeUncategorizedస‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకొండి

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకొండి

Date:

ఎడ‌తెరిపి లేని భారీవ‌ర్షాలు తెలంగాణ, ఏపీలో బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. వరద పరిస్ధితిపై కాంగ్రెస్‌ ఎంపీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బాసటగా నిలవాలని, సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరదలతో సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ, ఏపీ ప్రజల బాగోగులపై తాను కలత చెందుతున్నానని, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా రాహుల్‌ గాంధీ పోస్ట్ చేశారు.

సహాయ, పునారావస కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు సేవలు అందించాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను తాను కోరుతున్నానని చెప్పారు. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని, ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అలుపెరగకుండా శ్రమిస్తున్నదని చెప్పారు. ఈ విపత్తుతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం తక్షణమే సమగ్ర పునరావాస ప్యాకేజ్‌లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద జిల్లాకు రూ. 5 కోట్లు కేటాయించామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని కూడా సీఎం ప్రకటించారు. కాగా వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని, తక్షణ సాయం ప్రకటించాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.