Friday, September 27, 2024
HomeUncategorized92 మంది బిలియనీర్లతో ముంబాయి తొలి స్థానం

92 మంది బిలియనీర్లతో ముంబాయి తొలి స్థానం

Date:

ఆసియాలోనే అత్యధిక మంది కుబేరులకు నిలయంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయి మరో గుర్తింపు సాధించింది. చైనా రాజధాని బీజింగ్‌ను అధిగమించి తొలిసారి ఈ ప్రాంత బిలియనీర్‌ క్యాపిటల్‌గా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మేరకు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదికిగానూ అత్యధిక మంది శ్రీమంతులు నివాసముంటున్న నగరాల జాబితాను హురున్‌ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. 92 మంది బిలియనీర్లతో ముంబయి తొలి స్థానంలో నిలిచింది. 91 మందితో బీజింగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాది కాలంలో ముంబయిలో కొత్తగా 26 మంది సంపన్నుల క్లబ్‌లో చేరగా.. బీజింగ్‌ 18 మందిని ఈ జాబితా నుంచి కోల్పోయింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా బిలియనీర్‌ క్యాపిటల్‌గా ఎదిగిన నగరం ముంబయి అని నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కుబేరులున్న నగరాల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్‌ (119 మంది) అగ్ర స్థానంలో ఉండగా.. లండన్‌ (97) రెండో స్థానం దక్కించుకుంది. మన దేశ రాజధాని దిల్లీ తొలిసారి టాప్‌ 10లో చోటు సాధించింది. దేశాల వారీగా చైనానే ఈ జాబితా టాప్‌లో ఉంది. గత ఏడాది కాలంలో అక్కడ 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయినా.. 814 మంది బిలియనీర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా 800 మందితో రెండో స్థానం దక్కించుకుంది. ఏడాది క్రితం అగ్రరాజ్యంలో కొత్తగా 109 మంది రిచ్‌ క్లబ్‌లో చేరారు. ఇక 271 మందితో భారత్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.