Tuesday, October 15, 2024
HomeUncategorized67 నుంచి 17కు త‌గ్గిన నీట్ ర్యాంక‌ర్ల సంఖ్య‌

67 నుంచి 17కు త‌గ్గిన నీట్ ర్యాంక‌ర్ల సంఖ్య‌

Date:

నీట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆల్‌ ఇండియా ర్యాంకర్ల లిస్టును ఎన్టీయే శుక్రవారం (జులై 26) విడుదల చేసింది. తాజాగా ఫలితాల్లో నీట్‌ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 17కి తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వెలువడిన సవరించిన ఫలితాల్లో టాప్‌ స్కోర్ సాధించిన 17 మందికి 720 మార్కులకు 720 సాధించినట్లు ఎన్టీయే వెల్లడించింది. ఈ మేరకు నీట్‌ – యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను (రీరివైజ్డ్‌) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. టాప్‌ ర్యాంకర్ల సంఖ్య తగ్గడంతోపాటు మరోవైపు వేల మంది విద్యార్థుల మార్కులు, ర్యాంకుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి.

ఫిజిక్స్‌ సబ్జెక్టులో ఓ ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానానికి మాత్రమే మార్కులు కేటాయించాలని, మిగిలిన సమాధానాలకు మార్కులు తొలగించాలని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ సూచించింది. అది సూచించిన జవాబును పరిగణనలోకి తీసుకొని మళ్లీ మూల్యాంకనం చేసి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఇందులో దాదాపు 4.2 లక్షల మందికి 5 మార్కుల చొప్పున తొలగించారు. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 61 మంది విద్యార్థుల్లోని 44 మంది ఉన్నారు. దీంతొ వీరికి 720కి 715 మార్కులు సర్దుబాటు చేశారు. మార్కుల తొలగించడంతో వీరి ర్యాంకులపై ప్రభావం చూపింది. మరోవైపు గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి, వారందరికీ మళ్లీ మార్కులు కేటాయించారు.