Sunday, September 29, 2024
HomeUncategorized400 సీట్లు వస్తాయనేది బీజేపీ పార్టీ అతివిశ్వాసం

400 సీట్లు వస్తాయనేది బీజేపీ పార్టీ అతివిశ్వాసం

Date:

ఎన్నికలు పూర్తి కాకుండా, ఎన్నికల ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె దీనిపై మాట్లాడారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పెద్దసంఖ్యలో ఓటర్లు ఎన్డీయే కూటమికి ఓటేశారని, విపక్షాలను తిరస్కరించారని పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ఫలితాలు రాకుండా ఆయనకు ఎలా తెలుసన్నారు. ఈసారి 400 సీట్లు వస్తాయని ఆ పార్టీ అతివిశ్వాసంతో ఉందన్నారు. తాను ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతులను కాలరాసి చట్టాలు చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. తమ ప్రీతిపాత్రులైన మిత్రుల ప్రయోజనాల కోసం చట్టాలను రూపొందిస్తూ.. సామాన్యులను నిరుద్యోగం, పేదరికంలో నెడుతోందని ఆరోపించారు. చైనా దురాక్రమణపై లద్దాఖ్‌లో ఆందోళనలు చేస్తుంటే కేంద్రం మౌనంగా ఉందని విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా? అని విలేకరులు అడిగినప్పుడు ‘కొన్ని రోజులు ఆగండి మీకే తెలుస్తుంది’ అంటూ సమాధానం ఇచ్చారు.