Thursday, October 10, 2024
HomeUncategorized111 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రా

111 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రా

Date:

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఏర్ప‌డినా హైడ్రా ఇప్పటికే చెరువులను అక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది. అయితే పేద, మధ్య తరగతి వారు నివసిస్తున్న ఇళ్లు చెరువు బఫర్, ఎఫ్‌టిఎల్‌ ఉన్నా ముట్టుకోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇక చెరువు బఫర్, ఎఫ్ టీఎల్ లో నిర్మించిన వాణిజ్యం భవనాలు, నిర్మిస్తున్న ఇళ్లను మాత్రమే కూల్చి వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటి వరకు హైడ్రా తీసుకున్న చర్యలను మీడియాకు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూన్ 27 నుంచి ఇప్పటివరకూ 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు చెప్పారు. దీంతో 111.72 ఎకరాల భూమి కబ్జాకు గురికాకుండా కాపాడినట్లు వివరించారు. మొత్తం 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు తెలిపారు. జూన్ 27న ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ, ప్లాట్ నంబర్.30 (లోటస్ పాండ్)తో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు దుండిగల్ మండలం మల్లంపేట్ గ్రామంలోని 13 విల్లాల కూల్చివేతల వరకు కొనసాగాయని పేర్కొన్నారు.

గత కొద్ది రోజులుగా హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టిఎల్ లో నిర్మిస్తూన్న భవనాలను కూల్చివేస్తోంది. హైడ్రా సాధారణ ప్రజల నిర్మాణాలనే కాదు.. వీఐపీల నిర్మాణాలను కూడా కూల్చి వేసింది. తుమ్మిడి కుంట చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందినది. అలాగే ప్రముఖ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి సంస్థకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రాకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. హైడ్రా ఇలానే ముందుకెళ్లాలని సూచిస్తుంది. అయితే కొంత మంది తాము ఎప్పుడో ఇళ్లు కొనుగోలు చేశామని.. తమకు ఇళ్లు బఫర్, ఎఫ్టీఎల్‌లో ఉన్నట్లు తెలియదని చెబుతున్నారు. వీరి పట్ల హైడ్రా సానుకూలంగా ఉండాలని కోరుతున్నారు. అక్రమంగా నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.