Sunday, September 29, 2024
HomeUncategorizedసూరత్‌లో బిజెపి ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం

సూరత్‌లో బిజెపి ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం

Date:

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి బిజెపి పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్‌ విజయానికి మార్గం సుగమమైంది.

సూరత్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న నీలేశ్‌ కుంభనీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఆదివారం తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌వో వెల్లడించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం వీరంతా పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉండటం గమనార్హం. పోటీలో ముకేశ్‌ దలాల్‌ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన విజయంపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గుజరాత్‌ బిజెపి అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ దలాల్‌కు అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సూరత్‌ తొలి కమలాన్ని అందించింది” అని రాసుకొచ్చారు. అటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా దీనిపై పోస్ట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి చారిత్రక విజయానికి నాంది పడిందని.. ప్రధాని మోడీ నాయకత్వంలో గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరీ మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.