Friday, September 27, 2024
HomeUncategorizedవితంతువులు రెండో పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు

వితంతువులు రెండో పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు

Date:

ఝార్ఖండ్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోసం ఒక విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో మహిళల సంతోషకరమైన జీవితం కోసం ఓ సరికొత్త పథకం అమలులోకి తీసుకొచ్చింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతువులకు మరో జీవితాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా ఈ స్కీం ప్రవేశపెట్టారు. అనుకోని కారణాలు, లేదా విభేదాల వల్ల భాగస్వామి దూరమైన వాళ్లు, భర్త చనిపోయి ఒంటరి ప్రయాణం సాగిస్తున్న వారు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. కొందరైతే పిల్లలను కూడా చూసుకుంటూ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీం కింద రెండో పెళ్లి చేసుకున్న వితంతువులకు రెండు లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ఝార్ఖండ్ గవర్నమెంట్.

దేశంలో ఇలాంటి పథకం అమలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ పథకం అమలుపై కొన్ని కండీషన్స్ పెట్టింది ఝార్ఖండ్ ప్రభుత్వం. ఈ స్కీం అర్హత, విధివిధానాలు పేర్కొంటూ ఎక్కడా నిధులు పక్కదారి పట్టే ఛాన్స్ లేకుండా చేసింది. అలాగే అర్హులై ఉండి రెండో పెళ్లి చేసుకుంటున్న వితంతువులందరికీ ఈ స్కీం వర్తించేలా చేసింది.

ఈ స్కీం ద్వారా డబ్బు పొందాలనుకునే వారు మొదటి భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటుగా రెండో పెళ్లి రిపోర్ట్, మ్యారేజీ సర్టిఫికేట్‌ను అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు రెండో పెళ్లి చేసుకున్న ఏడాది లోపే ఈ సర్టిఫికేట్లు సమర్పించాలనే రూల్ పెట్టారు. అలాంటి వారికి మాత్రమే రెండు లక్షల సాయం అందిస్తారు. సమర్పించిన దరఖాస్తులను వెరిఫై చేసిన తర్వాత ఈ డబ్బు నేరుగా సదరు మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సమాజంలో వితంతు మహిళ రెండో పెళ్లి అంటే తప్పు అని, అదో నేరంలా చిన్నచూపు చూసేవారికి చెంపపెట్టులా ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు.